తెలంగాణపై బీజేపీ ఫోకస్..
మోదీ, అమిత్ షా పర్యటనలకు రంగం సిద్ధం!
డిసెంబర్‌లో ప్రధాని మోదీ పర్యటన..
వరంగల్‌లో కీలక ప్రాజెక్టులు జాతికి అంకితం
నవంబర్ 1న హైదరాబాద్‌లో బీజేపీ భారీ నిరసన ర్యాలీ
కొండారెడ్డిపల్లిలో ఓట్ల తొలగింపుపై సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు సవాల్
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయంగా బలపడటంపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్‌లో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ స్పష్టం చేసింది. వరంగల్‌లోని రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్, కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కును జాతికి అంకితం చేయనున్నట్లు సమాచారం. నవంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన ముఖ్యనేతల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావుతో పాటు పార్టీ ముఖ్యనేతలు, వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరాటం తదితర అంశాలపై చర్చించారు.
నవంబర్ 1న భారీ నిరసన ర్యాలీ
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో పాదయాత్ర చేపట్టనున్నట్లు వెల్లడించారు. “ప్రజాస్వామ్యాన్ని రక్షించండి.. గుంపు సామ్యాన్ని ఓడించండి” అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు పిలుపునిచ్చారు. దేశాన్ని బీజేపీ మాత్రమే రక్షించగలదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో నిరసనలు తెలిపేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలను పోలీసులు వెంటనే అరెస్టు చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ.. రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో వెల్లడించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రఘునందన్‌రావు సవాల్ విసిరారు. ఈ అంశంపై ముఖ్యమంత్రిని వెంకటేశ్వరస్వామి ఆలయానికి తీసుకువచ్చి సమాధానం చెప్పించాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఓట్లు తగ్గడానికి సొంత గ్రామాల్లోనే ఓటు ఉండాలనే ఆలోచన కూడా ఒక కారణమని పేర్కొన్నారు.
బీసీలకు 56 శాతం మంత్రి పదవులివ్వాలి
బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్రంలో బీసీల జనాభాకు అనుగుణంగా మంత్రివర్గంలో 56 శాతం మంత్రి పదవులు కేటాయించాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, నిరసనల సందర్భంగా అరెస్టులు, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.

