ఖో ఖో అభివృద్ధికి కృషి చేయాలి
గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి పెంచాలి
ప్రతిభావంతులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవకాశాలు
తెలంగాణ ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి
కాకతీయ, కామారెడ్డి: ఖో ఖో క్రీడ అభివృద్ధికి కృషి చేస్తూ, గ్రామీణ ప్రాంతాల యువతలో క్రీడలపై ఆసక్తిని పెంపొందించాలని తెలంగాణ రాష్ట్ర ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి సూచించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని లయోలా హైస్కూల్‌లో నిర్వహించిన జిల్లా ఖో ఖో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఖో ఖోకు ప్రోత్సాహం అందించడం వంటి అంశాలపై క్రీడా ప్రతినిధులతో చర్చించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని జంగా రాఘవరెడ్డి పేర్కొన్నారు. స్వదేశీ క్రీడలకు మరింత ప్రోత్సాహం అందించి తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఖో ఖో అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా నిర్వాహకులు, సీనియర్ క్రీడాకారులు, నూతన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

