దుర్గామాత ఊరేగింపులో దాడి.. ఇద్దరికి గాయాలు
ఐదుగురిపై కేసు నమోదు చేసిన కేశవపట్నం పోలీసులు
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని తాడికల్ గ్రామంలో దుర్గామాత ఊరేగింపు సందర్భంగా జరిగిన దాడి ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేశవపట్నం పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 21న రాత్రి సుమారు 10 గంటల సమయంలో తాడికల్ గ్రామంలో దుర్గామాత ఊరేగింపు జరుగుతుండగా, అదే గ్రామానికి చెందిన జనగాం మణికంఠ, బత్తిని సాయి, మొలుగూరి సాయికిరణ్, మొలుగూరి సందీప్, పంజాల వెంకటేష్‌లు మొలుగూరి హరీష్, మొలుగూరి కృష్ణలపై చేతులతో, చేతి కడెంతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో హరీష్‌కు కంటి పైన, ముఖంపై గాయాలు కాగా, కృష్ణకు మెడపై గాయమైనట్లు తెలిపారు. బాధితుల తరఫున మొలుగూరి మొగిలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు.

