రేవంత్.. చరిత్రలో నిలుస్తావా? కాలగర్భంలో కలిసిపోతావా?
జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై శాశ్వత పరిష్కారం చూపాలి
కాలుష్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి
ఈ నెల 27 నుంచి బాధితులతో పాదయాత్ర
ఒక్క కిలో చెత్త కూడా డంపింగ్ యార్డుకు రావొద్దు
: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
కాకతీయ,తెలంగాణ బ్యూరో : పాలకులకు వ్యక్తిగత కక్షలు ఉండకూడదని, పదవి గొప్పదనం కాదని.. ఆ పదవికి ఎంత న్యాయం చేస్తున్నామన్నదే ముఖ్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ప్రజల సమస్యను పరిష్కరించి చరిత్రలో నిలిచిపోతావా.. కాలగర్భంలో కలిసిపోతావా తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణ, బాధితుల సమస్యల పరిష్కారంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ప్రొఫెసర్ మురళీ మనోహర్ అధ్యక్షత వహించారు. మేధావులు, పర్యావరణవేత్తలు, డంపింగ్ యార్డు బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదన్నట్టుగా జీవించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. సుమారు 30 కిలోమీటర్ల పరిధిలో కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని, మహిళలకు గర్భస్రావాలు జరుగుతున్నాయని, పిల్లలు చర్మవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాలుగు నెలలైనా కదలిక లేదు
జవహర్‌నగర్ ప్రజల సమస్య పరిష్కారం కోసమే తొలిసారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని ఈటల తెలిపారు. సమావేశం నిర్వహించాలని సీఎం సూచించడంతో చర్చలు జరిపినా, నాలుగు నెలలు గడిచినా సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని విమర్శించారు. రాంకీ సంస్థ డబ్బు, పలుకుబడితో కోర్టుల తీర్పులు సైతం అమలు కావడం లేదని ఆరోపించారు. సంస్థకు వచ్చే సామాజిక బాధ్యత నిధులను స్థానికంగా తాగునీరు, రహదారులు, ప్రజల అవసరాలకు ఖర్చు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్నారని విమర్శించారు.
మరో ప్రాంతంలో చెత్త వేస్తే ప్రజలు అంగీకరించరని, అందుకే జీరో పొల్యూషన్ సాంకేతికతతో చెత్త నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఈటల సూచించారు. చెత్తను విద్యుత్, బయోగ్యాస్, సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించవచ్చని చెప్పారు. ఢిల్లీలో కోట్ల టన్నుల చెత్తను రీసైకిల్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. డంపింగ్ యార్డు సమస్యను పార్లమెంట్‌లో ప్రస్తావించానని, కేంద్ర మంత్రి కట్టర్‌ను కూడా కలిశానని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యతను తాము తీసుకుంటామని పేర్కొన్నారు.
27 నుంచి బాధితులతో పాదయాత్ర
ఈ నెల 27 నుంచి బాధితులతో కలిసి పాదయాత్ర ప్రారంభిస్తానని ఈటల ప్రకటించారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు పాల్గొనాలని ఆశిస్తున్నానని, సమస్య పరిష్కారమయ్యే వరకు రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చెత్త ఏరుకునే వారిని కూడా రాంకీ సంస్థ అడ్డుకుంటోందని విమర్శించారు. ఒక్క కిలో చెత్త కూడా జవహర్‌నగర్‌కు రాకూడదని, ప్రస్తుతం ఉన్న చెత్తను సైతం రీసైకిల్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు చేసే క్రమంలో కేసీఆర్‌ను బోనులో పెట్టాలని చూస్తున్నారని, తెలంగాణ రైతులు, ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టవద్దని ఈటల అన్నారు. 670 టీఎంసీల నీరు కిందకు వెళ్లిపోయిందని, తెలంగాణకు 150 టీఎంసీల నీరు సరిపోయేదని వ్యాఖ్యానించారు. డంపింగ్ యార్డు కాలుష్యం 12 లక్షల కార్ల నుంచి వెలువడే కాలుష్యానికి సమానమని పేర్కొంటూ, ఈ సమస్యపై రేవంత్‌రెడ్డి రాజకీయం చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

