న్యాయం అడిగితే అర్ధరాత్రి అరెస్టులా?
బీఆర్ఎస్ నేతల అరెస్టుపై వినయ్ భాస్కర్ ఆగ్రహం
వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల పక్షాన నిలిచిన బీఆర్ఎస్
మహిళలు, పేదలను ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం
అరెస్టయిన వారిని బేషరతుగా విడుదల చేయాలి
పట్టాలు, పక్కా ఇళ్లు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం
: ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్
కాకతీయ, హన్మకొండ : కాజీపేట వైఎస్సార్ నగర్లో దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేద గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, వారికి న్యాయం చేయాలని కోరినందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం దారుణమని ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో తమ హక్కుల కోసం శాంతియుతంగా ప్రశ్నించిన పేదలు, ముఖ్యంగా మహిళలను ఇళ్లలోకి వెళ్లి అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు వాటిని అమలు చేయాలని అడిగిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులకు పాల్పడుతోందని వినయ్ భాస్కర్ విమర్శించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు మహిళలు, నిరుపేదల పట్ల ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ నగర్ భూములపై కన్నేసిన కబ్జాదారులకు అధికార పార్టీ నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. పేదలను ఖాళీ చేయించే ప్రయత్నాలను బీఆర్ఎస్ సహించబోదని స్పష్టం చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, వైఎస్సార్ నగర్ మహిళలు, కాలనీవాసులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, క్షేత్రస్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్టయిన వారిలో మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, తండమళ్ల వేణు, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, దువ్వ కనకరాజు, బేధరకోట రంజిత్‌కుమార్, బరిగెల వినయ్, పాలడుగుల శివకుమార్, నయీమ్ జుబేర్, మహమ్మద్ హుస్సేన్, సిద్ధు, కొండ్ర శంకర్ ఉన్నారు. వైఎస్సార్ నగర్ వాసులు హరినాథ్, మంజుల, సతీష్ కూడా అరెస్టయ్యారు. తొలుత కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన వారిని బుధవారం ఉదయం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

