అక్షర సూరీడు అంబేద్కర్‌కు ఘన నివాళులు
కాకతీయ జమ్మికుంట : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట (బాలురు) ఉన్నత పాఠశాలలో బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాదం సురేష్ బాబు ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం సాధన కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. బౌద్ధమత ప్రాధాన్యతపై కూడా ఆయన విశ్లేషించారు.
తదనంతరం సహోపాధ్యాయుడు రాం. రాజయ్య మాట్లాడుతూ అక్షర సూర్యుడు, అపర మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సామాజిక రుగ్మతలైన అంటరానితనం, వివక్షత నిర్మూలన కోసం “వెపన్”లా పోరాడిన సంఘసంస్కర్తగా నిలిచారని పేర్కొన్నారు. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు వివిధ దేశాల్లో పర్యటించి భారతదేశానికి ఒక గిఫ్ట్‌గా రాజ్యాంగాన్ని రచించి అందజేశారని చెప్పారు. ఎన్నుకోబడిన పాలకులు మంచి వారైతేనే రాజ్యాంగ విలువలు సమర్థంగా అమలవుతాయని, ఆర్థిక అసమానతల నిర్మూలనకు “విద్య” ప్రధాన సాధనమని అన్నారు. ఉపాధ్యాయులే దిశానిర్దేశకులని, పాఠశాలలు బలోపేతమైతే దేశం అభ్యున్నత స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు. మహిళల హక్కుల పరిరక్షణలో అంబేద్కర్ దూరదృష్టి విశేషమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యేసుమని, వనజ, లక్ష్మి, శ్రీనివాస్, సమ్మయ్య, ప్రకాష్, చంద్రశేఖర్ (రిటైర్డ్ టీచర్) తదితరులు పాల్గొన్నారు

