మల్లన్న పోరాటంతోనే రాష్ట్రంలో కులగణన
కరీంనగర్లో టీఆర్పీ శ్రేణుల సంబరాలు
తీన్మార్ మల్లన్న చిత్రపటానికి క్షీరాభిషేకం
కాకతీయ, కరీంనగర్ : కులగణన సర్వేపై రాష్ట్రంలో కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో టీఆర్పీ శ్రేణులు కరీంనగర్లో సంబరాలు నిర్వహించాయి. తెలంగాణ చౌక్‌లో తీన్మార్ మల్లన్న చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మాట్లాడుతూ కులగణన కోసం మల్లన్న చేసిన పోరాటమే ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. అయితే విడుదల చేసిన నివేదికలో కులాల వారీ గణాంకాలు ప్రకటించకపోవడం తీవ్రంగా విమర్శించారు. శాసన మండలిలో మల్లన్న ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ “జంతువులకు లెక్కలు ఉంటే ప్రజలకు ఎందుకు లేవు?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కులాల వారీ వివరాలు వెల్లడించకపోవడం వెనుక ఉద్దేశ్యాలపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరినా స్పందన రాలేదని, పూర్తి స్థాయి గణాంకాలు బయటపెడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయనే కారణంతోనే ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరగాలంటే కులాల వారీ వివరాలు వెల్లడించాల్సిందేనన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే టీఆర్పీ ఆధ్వర్యంలో స్వయంగా కులగణన నిర్వహించి ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. బీసీలు రాజకీయంగా చైతన్యం సాధించి తమ ఓటుతో తమ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా నాయకులు, మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

