జగిత్యాల సభకు గ్రామస్తుల విరాళం
కాకతీయ, కరీంనగర్ / జగిత్యాల: జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు ముఖ్రా(కె) గ్రామస్తులు రూ.21,000 విరాళం ప్రకటించారు. గ్రామ రైతులు తమ వంతుగా ఈ మొత్తాన్ని సేకరించి, గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులు సుఖసంతోషాలతో జీవించారని గుర్తుచేశారు. తమ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచిందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై వారు విమర్శలు గుప్పిస్తూ, ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ సంక్షేమ పాలన రావాలంటే కేసీఆర్ నాయకత్వమే అవసరమని అభిప్రాయపడ్డారు. సేకరించిన విరాళాన్ని జగిత్యాలలో జరిగే సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అందజేయాలని గ్రామస్తులు మీనాక్షిని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌తో పాటు గ్రామ రైతులు దత్తా, తిరుపతి, ప్రహ్లాద్, లక్ష్మి, అర్చన, దైవశాల తదితరులు పాల్గొన్నారు.

