జీవితం విలువైనది.. ఆవేశానికి లొంగొద్దు
లక్ష్మణ్ కుటుంబాన్ని ఆకట్టుకున్ని ఆదుకున్న జాలిగామ గ్రామం
రూ.1.10 లక్షల విరాళం సేకరణ.. చిన్నారుల పేర ఎఫ్‌డీ
గ్రామ పెద్దలు, స్నేహితుల మానవత దృక్పథం
కాకతీయ, గజ్వేల్ : జీవితం ఎంతో విలువైనదని, క్షణిక ఆవేశం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో ఈ ఘటన మనందరికీ గుణపాఠమని జాలిగామ గ్రామస్తులు భావోద్వేగంగా పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఇటీవల మరణించిన లక్ష్మణ్ కుటుంబాన్ని ఆదివారం గ్రామస్తులు, స్నేహితులు పరామర్శించారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న చిన్నారుల పరిస్థితి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆ ఇంట్లో నెలకొన్న నిశ్శబ్దం, పిల్లల అమాయకత్వం గ్రామస్థులను తీవ్రంగా కదిలించింది. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్నేహితులు మాట్లాడుతూ ఈ కష్ట సమయంలో లక్ష్మణ్ కుటుంబం ఒంటరిది కాదని, గ్రామమంతా ఒక కుటుంబంలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థులు కలిసి విరాళాలు సేకరించారు. మొత్తం రూ.1.10 లక్షలు సేకరించి అందులో రూ.10,000ను తక్షణ ఖర్చుల కోసం కుటుంబానికి అందజేశారు. మిగిలిన రూ.1.00 లక్షలను చిన్నారుల పేరపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని నిర్ణయించారు.
చిన్నారుల భవిష్యత్తుకు ఆశాకిరణం
చిన్నారుల చదువులు, భవిష్యత్తు కోసం ఈ నిధులు ఉపయోగపడతాయని గ్రామస్తులు తెలిపారు. ఈ చర్యతో గ్రామంలో మానవతా విలువలు ఇంకా బతికే ఉన్నాయని మరోసారి స్పష్టమైంది. సమస్యలు వచ్చినప్పుడు ఆవేశపడకుండా పరస్పరం చర్చించుకుని పరిష్కారం కనుగొనాలని, జీవితాన్ని విలువైనదిగా భావించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. ఇంకా సహాయం చేయాలనుకునే దాతలు ముందుకు రావాలని, ఆ కుటుంబానికి తోడుగా నిలవాలని గ్రామ పెద్దలు కోరారు. మొత్తం మీద జాలిగామ గ్రామం చూపించిన ఈ మానవతా స్పందన అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

