దేశాభివృద్ధికి జనగణన కీలకం
: సీపీవో శ్రీనివాసాచారి
కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొదటి విడత హౌస్ లిస్టింగ్ శిక్షణ కార్యక్రమాన్ని సీపీవో శ్రీనివాసాచారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధి జనగణన సర్వేపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా డిజిటల్ సెన్సస్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలు సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఆర్పీలు పాతూరి మహేందర్ రెడ్డి, దోర్నాల భూపాల్ రెడ్డి జనగణన సర్వే విధానాన్ని వివరించారు. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శిక్షణ కార్యక్రమాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన సీపీవో శ్రీనివాసాచారి జిల్లా గ్రంథాలయంలో ఏసీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి భోజనం, టీ, చల్లని నీరు, మజ్జిగతో పాటు కూలర్లను ఏర్పాటు చేయడం పట్ల ఖాద్రీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి, సత్యనారాయణ, హరిప్రసాద్, బిల్ల శ్రీకాంత్, అజయ్, మాలతి, మరియా, శైలజ, శ్రీలత, చంద్రశేఖర్, మధుసూదన్, తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

