రూ.200 కోసం గొడవ.. ఇనుప రాడ్‌తో దాడి
ఒకరు మృతి.. నిందితుడు అరెస్ట్..!
కాకతీయ, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ముత్యంపేట గ్రామంలో కేవలం ₹200 కోసం జరిగిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కక్షతో తూర్పాటి కనకయ్య (45) అనే వ్యక్తి కిరాణా దుకాణదారుడిపై ఇనుప రాడ్‌తో దాడి చేయగా, చికిత్స పొందుతూ బాధితుడు మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 19న రాత్రి నిందితుడు కనకయ్య, స్థానిక కిరాణా దుకాణదారుడు బిల్లా శంకరయ్య వద్దకు వెళ్లాడు. తన రేషన్ కార్డును తాకట్టు పెట్టి ₹200 నగదు ఇవ్వాలని కోరాడు. అయితే శంకరయ్య డబ్బులు లేవని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఆగ్రహంతో ఊగిపోయిన కనకయ్య, తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్‌తో శంకరయ్య కడుపులో బలంగా పొడిచాడు. భర్తను కాపాడబోయిన శంకరయ్య భార్య కళావతిపై కూడా దాడి చేసి ఆమె తలపై కొట్టాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
చికిత్స పొందుతూ మృతి..
తీవ్రంగా గాయపడిన దంపతులను కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శంకరయ్య 20వ తేదీ ఉదయం ప్రాణాలు వదిలారు. భార్య కళావతి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. యెల్లారం సమీపంలో తలదాచుకున్న నిందితుడు కనకయ్యను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్‌తో పాటు మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. స్వల్ప మొత్తానికి జరిగిన గొడవ ఇలా హత్యకు దారితీయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

