“నా ప్రయాణం ఇక కేసీఆర్‌తోనే”
గాయని మధుప్రియ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ కేవలం నాయకుడు కాదంటూ.. భావోద్వేగం
కాకతీయ, వేములవాడ: జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రముఖ జానపద గాయని మధుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన రాజకీయ ప్రయాణం మరియు మద్దతు ఇకపై కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతోనేనని ఆమె స్పష్టం చేశారు. సభలో ప్రసంగించిన మధుప్రియ.. “తెలంగాణలో బాపు కేసీఆర్ అంటే ఒక భావోద్వేగం. ఆయన ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో ఉన్నారు” అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తో కలిసి తాను పాల్గొన్న ధూమ్-ధామ్ కార్యక్రమాలను, సకల జనుల సమ్మె రోజులను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ తనను ఎప్పుడూ సొంత బిడ్డలా చూసుకుంటారని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ప్రభుత్వ తీరుపై విమర్శలు..
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎటు చూసినా కూల్చివేతలు, కరెంట్ కోతలు, రైతుల అవస్థలే కనిపిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తనకు పెద్దగా అవకాశాలు రాలేదని, గత రెండేళ్లుగా భారీ సభల్లో పాట పాడలేకపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభల్లో పాడటంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూనే, తన అంతిమ ప్రయాణం మరియు మద్దతు మాత్రం కేసీఆర్‌కే ఉంటాయని మధుప్రియ స్పష్టం చేశారు. తనకు నేరుగా రాజకీయాలతో సంబంధం లేకపోయినా, తెలంగాణ ప్రజల మేలు కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి వివాదాలు చేయవద్దని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు న్యాయం జరగాలన్నదే తన ఆకాంక్ష అని ఆమె ముగించారు.

