మే 21లోగా రాజీవ్ చౌక్ పనులు పూర్తి చేయాలి
పెండింగ్ పనులకు గడువు విధింపు
కొత్త టెండర్ల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్
సుడా కార్యాలయ భవన పనులు వేగవంతం
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ సుడా పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సుడా కార్యాలయంలో వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం, చౌక్ సుందరీకరణ, ఐడీఎస్ఎంటీ పనులు మరియు వర్టికల్ గార్డెన్ల అభివృద్ధిని మే 21వ తేదీలోగా పూర్తి చేయాలని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. అదే రోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ పనులను ముఖ్య అతిథులతో ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సుడా కమర్షియల్ బిల్డింగ్ తొలి విడత పనులు చివరి దశకు చేరుకున్నాయని, అవి పూర్తయిన వెంటనే తదుపరి పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు.
పనుల్లో నాణ్యత పాటించాలి
అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా చేపట్టాల్సిన పనులకు టెండర్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. నగర సుందరీకరణలో భాగంగా చేపట్టిన వర్టికల్ గార్డెన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్‌కుమార్, ఈఈ శివానంద్, డీఈఈలు రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఏఈఈలు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

