రోడ్లపై ధాన్యం రాశులు.. ప్రయాణికులకు తప్పని తిప్పలు!
రహదారులను ఆక్రమించిన ధాన్యం కల్లాలు.. ఏటా ఇదే తంతు
రైతులకు అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలం
కిలోమీటర్ల మేర రోడ్లపై ధాన్యం ఆరబెడుతున్న రైతులు
తరుచూ రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు
రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో మొదలవ్వని కాంటాలు
రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతం
కాకతీయ, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రధాన రహదారులు ప్రస్తుతం ధాన్యం కల్లాలను తలపిస్తూ ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రావడంతో, ఆరబోసుకోవడానికి కల్లాల కొరత కారణంగా కిలోమీటర్ల మేర రోడ్లనే వేదికగా చేసుకుంటున్నారు. ఏటా ఇదే తంతు పునరావృతం అవుతున్నప్పటికీ అటు రెవెన్యూ, ఇటు పోలీసు యంత్రాంగం రైతులకు కనీస అవగాహన కల్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ శూన్యం కావడంతోనే రైతులు ధైర్యంగా ప్రధాన రహదారులను ఆక్రమిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల మధ్య లోపించిన సమన్వయం
ఇటీవల పలు గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినప్పటికీ, రోజులు గడుస్తున్నా కాంటాలు పెట్టకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పంట కోత సీజన్ ప్రారంభానికి ముందే గ్రామాల్లో దండోరా వేయించి, గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ మండలంలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల మధ్య సమన్వయ లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రహదారి భద్రతపై నిత్యం నిఘా ఉంచాల్సిన యంత్రాంగం, రోడ్లపై ధాన్యం రాశుల విషయంలో చూసిచూడనట్లు వ్యవహరించడంపై వాహనదారులు మండిపడుతున్నారు.
వాహనదారుల ప్రాణాలకు ముప్పు
రోడ్లపై సగం వరకు ధాన్యం ఆరబోయడంతో ఎదురుగా వాహనాలు వచ్చినప్పుడు పక్కకు తప్పుకునే అవకాశం లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పగలు ఏదో రకంగా నెట్టుకొస్తున్నా, రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి ఎగిరి వచ్చి వాహనాలపై పడుతుండటంతో ప్రాణాపాయ స్థితి నెలకొంటుందని వాహనదారులు వాపోతున్నారు. గతంలో అనేక ప్రమాదాలు జరిగి పలువురు గాయపడిన ఉదంతాలు ఉన్నా, ఈసారి కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం విచారకరం. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై ధాన్యం రాశులను తొలగించి ప్రయాణాలను సురక్షితం చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై రాయపర్తి ఎస్సై ముత్యం రాజేందర్ స్పందిస్తూ.. రోడ్లపై ధాన్యం ఆరపోయవద్దని, ప్రత్యామ్నాయంగా రైతులు తమ కల్లాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల భద్రత తమకు ముఖ్యమని, రైతులు పోలీసులకు సహకరించాలని కోరారు. వాహనదారులకు, ప్రయాణికులకు అంతరాయం కలిగించేలా రహదారులపై ధాన్యం ఆరబోస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది మరియు స్థానిక రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఆయన ఆదేశించారు.

