ఉత్తమ పాఠశాలగా పమ్మి ఎంపీపీఎస్ ఎంపిక
ఉపాధ్యాయుల కృషితో దక్కిన గౌరవం
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు ఘన సన్మానం
కాకతీయ, ముదిగొండ : మండలంలోని పమ్మి ఎంపీపీఎస్ పాఠశాల సీఈపీ ప్రోగ్రాంలో ఉత్తమ పాఠశాలగా ఎంపికై రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులకు ఘన సన్మానం నిర్వహించారు. సర్పంచ్ వడ్డే మాధవరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఉపాధ్యాయుల సేవలను అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వడ్డే మాధవరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తూ జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా నిలవడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల నిరంతర కృషి, అంకితభావం వల్లే ఈ అరుదైన గుర్తింపు సాధ్యమైందని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన తెలిపారు.
గ్రామానికి దక్కిన గౌరవం
రాష్ట్రస్థాయిలో పమ్మి పాఠశాల పేరు మారుమోగడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సన్మానం పొందిన వారిలో ఉపాధ్యాయులు సురేష్, రమణ రెడ్డి, షర్మిల, నాగలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యున్నతికి మరింత కష్టపడి పనిచేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పంజాల రాజేష్ గౌడ్, కార్యదర్శి రాధిక, వార్డు సభ్యులు ఏలూరి రజని, అన్నెగాని నాగమణి, బుగ్గవీటి జగదీశ్, గ్రామ పెద్దలు ఏలూరి హనుమంతరావు, రాయబారపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

