రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన
ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి కాంగ్రెస్
సీఎం రేవంత్ రెడ్డికి రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేదు
మాజీ ఎంపీపీ మెడిశెట్టి శ్రీధర్ ధ్వజం
కాకతీయ, చేర్యాల : మోసపూరిత మాటలతో ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో దుర్మార్గపు పాలన నడిపిస్తున్నారని చేర్యాల మాజీ ఎంపీపీ మెడిశెట్టి శ్రీధర్ మండిపడ్డారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి, రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపిన కేసీఆర్ పాలనను కోల్పోయినందుకు ప్రజలు నేడు పశ్చాత్తాపపడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని, కేసీఆర్ లేని లోటు ప్రజలకు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
రైతును ఆగం చేసిన సర్కార్
ఒకప్పుడు తెలంగాణ రైతు ధనవంతుడిగా వెలుగొందారని, నేడు సాగునీరు లేక, రైతుబంధు అందక, పండిన వడ్లు కొనే దిక్కులేక రైతాంగం డీలా పడిందని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో భూముల ధరలు అమాంతం పడిపోయాయని, హైదరాబాద్ ఆదాయం సగానికి సగం తగ్గిందని విమర్శించారు. ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్రం దివాలా తీసిందని, అప్పు పుట్టడం లేదని బాహటంగా చెబుతున్నారంటేనే పాలన ఏ తీరుగా ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఎన్ని ఎకరాలకు పంట పరిహారం ఇచ్చారో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. ప్రజలను, రైతులను ఆదుకోవాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి లేదని, మొసలి కన్నీళ్లు కారుస్తూ గాలి మోటార్లలో తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణలో ఇంతకంటే దుర్మార్గమైన పాలన మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో 11వ వార్డు కౌన్సిలర్ ఇజాజ్ అహ్మద్, కోట రాజు, మంచాల సంతోష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.

