ప్లాస్టిక్ తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
ఇందుర్తి పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం
విద్యార్థులకు వివిధ పోటీలు.. విజేతలకు బహుమతులు
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
జిల్లా కన్వీనర్ బి. ఓదెలు కుమార్
కాకతీయ, కరీంనగర్ / ఇందుర్తి: ప్రపంచ భూమి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుర్తి పాఠశాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల మమకారాన్ని, బాధ్యతను పెంపొందించే ఉద్దేశంతో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ మరియు నినాదాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామంలో “భూమిని కాపాడండి – వృక్షాలను పెంచండి” అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కన్వీనర్ బి. ఓదెలు కుమార్ మాట్లాడుతూ.. మానవ మనుగడకు ఆధారమైన భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్రకృతి వనరులను వృధా చేయకుండా భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు
ప్రధానోపాధ్యాయురాలు జయప్రద మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు వారధులుగా నిలవాలని కోరారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, మంజుల, వేణు, ఎస్‌వీఆర్ చారి, మాధవి, పవన్ కుమార్, శ్రీదేవి, సబిత, సూర్య ప్రకాష్, నిహారిక, సత్యనారాయణ, మునీందర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

