ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు
కార్మిక సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం
డిపో వద్ద నిరసనలో పాల్గొన్న అఖిల్ పాషా, అరుణ
ప్రైవేట్ డ్రైవర్లతో ప్రమాదాలు పెరిగాయని ఆరోపణ
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షురాలు గంగిపెళ్లి అరుణ పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్పీ నాయకులు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజలకు సేవలందిస్తూ ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చే ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు కొలిక్కి వచ్చే వరకు కార్మికులతో కలిసి టీఆర్పీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
ప్రజల ప్రాణాలతో చెలగాటం
సమ్మె సాకుతో అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపడం వల్ల ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని నాయకులు ఆరోపించారు. ఇటీవల జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని, ఇందుకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులను బెదిరించడం మానేసి, వారితో చర్చలు జరిపి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని హితవు పలికారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని టీఆర్పీ నాయకులు హెచ్చరించారు. కార్మిక లోకానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

