మొక్కజొన్న రైతుల పాట్లు.. కల్లాల్లోనే పడిగాపులు
కొనుగోలు కేంద్రాలు లేక అన్నదాతల అవస్థలు
హమాలీ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి
కారేపల్లి మండలంలో వివక్ష వీడాలి – సీపీఐ(ఎం)
కాకతీయ, కారేపల్లి: మండలంలోని మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు లేక తీరని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే. నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కారేపల్లి మండలం మాదారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం నాయకులతో కలిసి వారు సందర్శించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, హమాలీ రేట్లు, లారీల కొరతపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసినా, ప్రభుత్వం కేవలం మారుమూల ఉన్న మాదారంలోనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం విచారకరమన్నారు. రేలకాయలపల్లి, చీమలపాడు, తొడితలగూడెం, పోలంపల్లి, కమలాపురం రైతులు సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి రావడం ఆర్థికంగా భారంగా మారిందని పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటూ నష్టపోతున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతమైన కారేపల్లిపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ధ్వజమెత్తారు.
ఖర్చులన్నీ రైతుపైనేనా?
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించాల్సి రావడం అన్యాయమని, ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. లారీ డ్రైవర్లు మామూళ్ల పేరుతో బస్తాకు రూ. 5 అడుగుతున్నారని, గోదాముల వద్ద కూడా వసూళ్ల పర్వం సాగుతోందని విమర్శించారు. లారీల దిగుమతికి వారం రోజులు పడుతుండటంతో రైతులు కళ్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే హామీ..
రైతుల సమస్యలను సీపీఐ(ఎం) నాయకులు కొనుగోలు కేంద్రం నుండే వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు ఫోన్ ద్వారా వివరించారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ అదనపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ప్రస్తుతం ఉన్న కేంద్రంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఈవో బొల్లు హనుమంతరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు, నాయకులు తుమోజు రామ్మూర్తి, పాపినేని నాగేశ్వరరావు, పొట్లకాయల రమేష్, జడల నాగేశ్వరరావు, రజిని, కిలారి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

