ఆర్టీసీ సమ్మె శాంతియుతంగా సాగాలి…అల్లర్లకు తావిస్తే కఠిన చర్యలు
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ : కరీంనగర్లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. సమ్మె ప్రజాస్వామ్య హక్కు అయినప్పటికీ అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే జరగాలని స్పష్టం చేశారు. ప్రజా అశాంతి సృష్టించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సమ్మె కారణంగా సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలను వినియోగించే వారికి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మరియు రవాణా వ్యవస్థపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, లేదా ఆర్టీసీ సిబ్బంది తిరిగి డ్యూటీలో చేరినా వారికి ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. బస్టాండ్లు, డిపోలు, ప్రధాన కూడళ్ల వద్ద అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, అధికారులపై దాడులు వంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చేసే వారిపైనా నిఘా ఉంచినట్లు తెలిపారు.
సమ్మెలో పాల్గొనే కార్మికులు పరస్పర గౌరవంతో వ్యవహరించాలని, ఉద్రిక్తతలకు తావు లేకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు చేపడితే చట్టపరమైన చర్యలతో పాటు శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరుతూ, అనుమానాస్పద పరిస్థితులు గమనించినా లేదా బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరించిన ఘటనలు ఎదురైనా వెంటనే స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712670713కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

