సమ్మె ప్రభావం: రెండో రోజూ కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల కష్టాలు
కాకతీయ, కరీంనగర్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకి చేరడంతో కరీంనగర్ బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లోనే వేచి చూస్తూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం బయలుదేరినవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమ్మె కారణంగా పలు రూట్లలో బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆందోళన చెందుతున్నారు. కొందరు ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించగా, అధిక చార్జీలతో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, కొన్ని చోట్ల ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది.
బస్టాండ్‌లో సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ఎప్పుడు బస్సులు నడుస్తాయో స్పష్టత లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సమ్మె కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


