పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల సాయం
రెండో విడతలోనూ అర్హులందరికీ అవకాశం
ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్
కాకతీయ, నెల్లికుదురు: రాష్ట్రంలోని పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ అన్నారు. మండలంలోని నరసింహులగూడెం గ్రామంలో పొన్నం మహేష్–స్వాతి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలకు గౌరవప్రదమైన నివాసాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సొంత స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వికలాంగులు మరియు భూమిలేని నిరుపేదలకు ప్రాధాన్యత ఇస్తూ విడతల వారీగా గృహాలను మంజూరు చేస్తామన్నారు.
రెండో విడతలో అందరికీ అవకాశం..
మొదటి విడతలో ఇళ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

