పోరాడి హక్కులు సాధించుకోవాలి
కార్మికులు అఘాయిత్యాలకు పాల్పడవద్దు
శంకర్ గౌడ్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
కాకతీయ, కూసుమంచి: పోరాటాలు తెలంగాణ ప్రజలకు కొత్తేం కాదని, ఆత్మహత్యలు చేసుకోకుండా పోరాడి హక్కులను సాధించుకోవాలని పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇంచార్జి కందాళ ఉపేందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ నర్సంపేటలో డ్రైవర్ కోల శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం అత్యంత బాధాకరమని కందాళ పేర్కొన్నారు. కార్మికులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, సహనంతో ఉండి సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి..
కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలనే అమలు చేయమంటున్నారని గుర్తు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం మానుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికులకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ఆయన హెచ్చరించారు. సమ్మెను పోలీసులు, నిర్బంధాలతో అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.

