అగ్నికి ఆహుతైన 14 క్వింటాళ్ల మిర్చి
గిరిజన రైతుకు రూ. 4 లక్షల నష్టం
కాకతీయ, కారేపల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట, చేతికొచ్చే సమయంలో అగ్నిప్రమాదానికి గురై బుగ్గిపాలవడంతో ఓ గిరిజన రైతు నిట్టనిలువునా మునిగిపోయాడు. కారేపల్లి మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానిక రైతాంగాన్ని కలచివేసింది. గురువారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు కొండెబోయిన నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం బాధితుడిని పరామర్శించి, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేసింది. మండలానికి చెందిన అజ్మీర శ్రీనివాస్ అనే గిరిజన రైతు భూమిని కౌలుకు తీసుకుని ఎంతో కష్టపడి మిర్చి సాగు చేశాడు. కోత అనంతరం దాదాపు 14 క్వింటాళ్ల మిర్చిని కల్లంలో ఆరబోశారు. అయితే, ఊహించని రీతిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఆ మిర్చి మొత్తం కాలి బూడిదైంది. దీని విలువ సుమారు రూ. 4 లక్షల వరకు ఉంటుందని అంచనా. కష్టమంతా కళ్లముందే బూడిద కావడంతో బాధితుడు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నాడు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పండగ కొండయ్య, కల్తి రామచంద్రు, పోతర్ల నాగేశ్వరరావు, కరపటి సీతారాములు, దారావత్ వస్రాం, కుర్సం శ్రీను, భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.

