డంపింగ్ యార్డుతో హుజూరాబాద్‌కు ముప్పు
నాలుగు జిల్లాల చెత్త ఇక్కడ వేయడమేంటి?
ప్రజల ఆరోగ్యం, పర్యావరణంపై ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆందోళన
సిర్సపల్లిలో ప్రతిపాదిత స్థలం పరిశీలన
కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో 125 ఎకరాల్లో నాలుగు జిల్లాలకు చెందిన చెత్తను డంపింగ్ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ యార్డు ఏర్పాటుతో స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, హుజూరాబాద్ ప్రాంత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇతర స్థానిక నాయకులతో కలిసి ఆయన ప్రతిపాదిత స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. నాలుగు జిల్లాల చెత్తను ఒకే చోట చేర్చడం వల్ల స్థానికుల జీవన విధానం అస్తవ్యస్తమవుతుందని, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. కాలుష్యం పెరిగి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి..
డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా స్థానిక ప్రజలు నిరసనలు, ఆందోళనలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టించడం తగదని, వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న హుజూరాబాద్ ప్రాంతాన్ని కాలుష్యమయం చేయవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

