ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ అండ
శంకర్ గౌడ్ మృతి ప్రభుత్వ హత్యే
డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలచివేసిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, కార్మికుల సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ‘ప్రభుత్వ హత్య’ అని ఆయన విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని కౌశిక్ రెడ్డి గుర్తుచేశారు. ఆ జీఓను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో సంస్థ బలోపేతం కోసం ఏడాదికి రూ. 1,500 కోట్లు కేటాయించామని, నేడు నిధుల కొరతతో సంస్థ ఆర్థికంగా కునారిల్లుతోందని ఆరోపించారు. కార్మికులకు వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
అధైర్యపడొద్దు.. ఐక్యంగా పోరాడదాం
ఆర్టీసీ కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని, బలవన్మరణాలకు పాల్పడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాలని, కార్మికుల పక్షాన నిలబడేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికులను చర్చలకు పిలవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

