ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ వేయాలి
టీయూఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్కటి సంజీవ్ రెడ్డి
కాకతీయ, జమ్మికుంట: తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమ ఫోరం (టీయూఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎక్కటి సంజీవ్ రెడ్డి డిమాండ్ చేశారు. జమ్మికుంటలోని శంకరనందన్ గార్డెన్‌లో నిర్వహించిన హుజూరాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
ఉద్యమ సమయంలో ఎఫ్‌ఐఆర్ నమోదైన వారితో పాటు, వివిధ రీతుల్లో సేవలందించిన వారిని ప్రభుత్వం గౌరవించాలని సంజీవ్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాంల దృష్టికి తీసుకెళ్లామన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీయూఎఫ్ సంస్థను గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నేతల భాగస్వామ్యం..
తమ ప్రాంత ఉద్యమకారుల మద్దతు వల్లే తనకు రాష్ట్రస్థాయి పదవి దక్కిందని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని ఈ సందర్భంగా సంజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నకిర్త రాజు, జక్కే కిరణ్, కందికట్ల మధుసూదన్, మూడేళ్ల కుమారస్వామి, చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్వేశం పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ మార్కెట్ అధ్యక్షుడు కనబోయిన శ్రీనివాస్, నియోజకవర్గ కన్వీనర్ ఆరే రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు నీల నాగరాజు, కన్నవేణి సతీష్ తదితరులు హాజరయ్యారు.

