ఐటీడీఏ పీఓగా లెనిన్ వాత్సల్ బాధ్యతల స్వీకరణ
గిరిజన సంక్షేమ పథకాలపై అధికారులతో సమీక్ష
పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచన
కాకతీయ, ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ (గిరిజన అభివృద్ధి సంస్థ) నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా శ్రీ లెనిన్ వాత్సల్ టోప్పో (ఐఏఎస్) ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన పీఓ.. ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు.
బాధ్యతలు చేపట్టిన వెంటనే పీఓ అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అమలవుతున్న గిరిజన సంక్షేమ పథకాలు, విద్యా, వైద్య సదుపాయాల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో పారదర్శకత పాటించాలని, పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్ నియామకంతో ఐటీడీఏ పరిధిలో పెండింగ్ పనులు వేగవంతం అవుతాయని సిబ్బంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఏపీఓ) కె. నాగరావు, అధికారులు ఎం. రాజ్‌కుమార్, వి. శ్రీనివాస్, కె. నర్సింగ్, పీసా కోఆర్డినేటర్ కె. ప్రభాకర్ మరియు ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

