కమిషనరేట్‌లో వాసవీ మాత జయంతి వేడుకలు
అమ్మవారి చిత్రపటానికి అదనపు డీసీపీల నివాళి
ఆర్యవైశ్యుల సేవలు అభినందనీయం
కాకతీయ, హనుమకొండ: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని పరిపాలన విభాగంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటానికి జిల్లా అదనపు డీసీపీలు రవి, సురేష్, శ్రీనివాస్, ఏసీపీ సురేంద్రలు పూలమాలలు వేసి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. అనంతరం పోలీస్ అధికారులు ఆర్యవైశ్య సోదరులందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించడం ముదావహమన్నారు. సమాజంలో ఆర్యవైశ్యులు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది పేదలకు అండగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని వారు సూచించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్.ఐలు శ్రీనివాస్, సతీష్, చంద్రశేఖర్, శ్రీధర్‌తో పాటు పలువురు ఆర్.ఎస్.ఐలు, ఇతర పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

