తుంగతుర్తిలో వాసవీ మాత ఆలయ భూమి పూజ
కాకతీయ, తుంగతుర్తి: తుంగతుర్తి పట్టణ కేంద్రంలో శ్రీ వాసవీ మాత సమేత నగేశ్వర స్వామి, విఘ్నేశ్వర ఆలయ నిర్మాణ భూమి పూజ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. మండల ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు సూర్యాపేట నుంచి విచ్చేసిన వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆధ్యాత్మిక వాతావరణంలో, భక్తుల జయజయధ్వానాల మధ్య ఈ కార్యక్రమం సాగింది.
ఐకమత్యంతో ఆలయ నిర్మాణం..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సదాచార్ ట్రస్ట్ చైర్మన్, వాసవీ మాత ట్రస్ట్ సభ్యులు ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో భూమి పూజను విజయవంతంగా పూర్తి చేసుకున్నామని తెలిపారు. “ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్యవైశ్యులు ఐకమత్యంతో పనిచేయాలి. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలోని దాతలు ప్రత్యేక ఆర్థిక సహకారం అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలి” అని కోరారు. ఇప్పటివరకు తోడ్పాటు అందించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలో ఆర్యవైశ్య మహాసభ మండల అధ్యక్షుడు ఈగ నాగన్న, సీనియర్ సభ్యులు ఓరుగంటి అంతయ్య, తాటికొండ సీతయ్య, పోలవరపు సంతోష్, బండారు దయాకర్, ఈగల లక్ష్మయ్య, శరీరాల మల్లయ్య, బుద్ధ వీరన్న, మాశెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ, గుండా శ్రీనివాస్ మరియు వివిధ మండలాల ఆర్యవైశ్య సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

