మామిడిగూడెంలో ‘బృహత్ శిలాయుగ’ సమాధులు!
వెలుగులోకి అరుదైన నిర్మాణాలు
వందలాది డాల్మెన్ సమాధులు.. మానవాకృత శిల్పాలు
చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్న ‘తెలంగాణ డిస్కవరీ టీం’ పరిశోధన
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మామిడిగూడెం పరిధిలోని గుట్టలు అద్భుత చారిత్రక రహస్యానికి వేదికయ్యాయి. తెలంగాణలోనే ఇప్పటివరకు కనిపింనంత అతిపెద్ద ‘బృహత్ శిలాయుగం’ నాటి శ్మశాన వాటికను ‘తెలంగాణ డిస్కవరీ టీం’ ఆదివారం వెలుగులోకి తెచ్చింది. ఇక్కడి అరుదైన నిర్మాణాలు యావత్ భారతదేశ చరిత్రకారులను ఆకర్షిస్తాయని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలిపారు. ప్రతిరోజూ ఒక కొత్త చారిత్రక అంశాన్ని వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో రెడ్డి రత్నాకర్ రెడ్డి, తన బృంద సభ్యులు కుంజ రాజ్ కుమార్, వినయ్ గోలిలతో కలిసి ఈ పరిశోధన సాగించారు. మామిడిగూడెంలోని రెండు గుట్టల మధ్య ఏటవాలుగా ఉన్న ప్రాంతంలో వందలాది ‘డాల్మెన్’ సమాధులు ఉన్నాయి. ఇవి సామాన్య పూర్వ సంవత్సరం (బీసీ) 2000 నుంచి సామాన్య సంవత్సరం (ఏడీ) 500 మధ్య కాలానికి చెందినవని పరిశోధకులు గుర్తించారు.

సమాధి ముందు మానవాకృత శిల్పం!
ఇక్కడి నిర్మాణాల్లో ఇతర ప్రాంతాల్లో లేని ఎన్నో విశేషాలు ఉన్నాయని రత్నాకర్ రెడ్డి వెల్లడించారు. దాదాపు ప్రతి సమాధి ముందు ఒక మానవాకృత శిల్పం, ఒక నీటి తొట్టి ఉండటం గమనార్హం. మూడు అడుగుల ఎత్తైన శిలపై చిన్న రోలు ఉన్న ప్రత్యేక నిర్మాణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గుట్ట ఉపరితల శిలలను పలకలుగా తొలిచి ఈ సమాధులను నిర్మించారు. ఈ ప్రాంతంలో 5000 ఏళ్ల కిందటి సూక్ష్మరాతి పనిముట్లు కూడా లభ్యమయ్యాయి.
దామరవాయిని మించి..
తెలంగాణలో ఇప్పటివరకు ప్రసిద్ధి చెందిన దామరవాయి సమాధులలో కేవలం కొన్ని మాత్రమే మానవాకృత శిల్పాలు ఉండగా, మామిడిగూడెంలో వందలాదిగా ఉండటం పురావస్తు శాఖను సైతం ఆశ్చర్యపరిచే అంశం. రెండు గుట్టల మధ్య నిరంతరం ప్రవహించే నీటి పాయ, చుట్టూ ఉన్న ప్రకృతి అందాల నడుమ ఈ చారిత్రక సంపద నిక్షిప్తమై ఉంది. మామిడిగూడెం చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు. పురావస్తు శాఖ అధికారులు వెంటనే ఈ ప్రాంతాన్ని సందర్శించి, దీనిని ‘పురావస్తు రక్షిత ప్రాంతం’గా ప్రకటించాలని ఆయన కోరారు. ఈ ఆవిష్కరణ తెలంగాణ ప్రాచీన చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

