శంకరపట్నంలో మిన్నంటిన బీఆర్ఎస్ వేడుకలు
ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్న కార్యకర్తలు
కాకతీయ, శంకరపట్నం: మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు గంట మహిపాల్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, జై తెలంగాణ.. జై జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు యువకులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

