ఆధునిక సాగుతోనే రైతుకు ఆర్థిక పురోగతి
గ్రామ స్థాయికి శాస్త్రవేత్తలు..
రైతులకు ప్రత్యక్ష మార్గదర్శకం
ఖమ్మం జిల్లాలో త్వరలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
యూరియా వాడకం తగ్గించి సేంద్రియ సాగుపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ దివాకర
కాకతీయ, రఘునాథపాలెం/ మయూరి సెంటర్ : ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారానే రైతులకు అధిక ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి ఆయన పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు నేరుగా గ్రామ స్థాయికి వచ్చి రైతులకు సాగు మెళకువలు నేర్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణను విస్మరించారని, ప్రస్తుత ప్రభుత్వం దీనికోసం భారీగా నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఈ నిధులను రైతులకు ఏ విధంగా ఉపయోగించాలో అన్నదాతలే సూచనలు ఇవ్వాలని కోరారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
లాభదాయకమైన ‘ఆయిల్ పామ్’
ఖమ్మం జిల్లా రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మొగ్గు చూపాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుంది. ఆయిల్ పామ్ సాగు చేస్తే నాలుగేళ్లలో రూ. 51 వేల సబ్సిడీ అందుతుంది. 40 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం రావడమే కాకుండా, కోతుల సమస్య, మార్కెటింగ్ ఇబ్బందులు ఉండవు. అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు సాగు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.
ఆహార భద్రత – భూసార రక్షణ
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభా దృష్ట్యా భవిష్యత్తులో ఆహార భద్రత కీలక సవాల్‌గా మారబోతోందన్నారు. రైతులు విచక్షణారహితంగా యూరియా వాడటం వల్ల భూసారం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మల స్వయంగా రైతు అని, ఆయన తన పొలాల్లో యూరియా వాడకుండా ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. రసాయనాలతో పండించిన పంటల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, సేంద్రియ సాగు (ఆర్గానిక్ ఫార్మింగ్) వైపు రైతులు అడుగులు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

