పాలకవర్గ ఆమోదం లేకుండా నిర్ణయాలా..?
ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లునిరసన
చెత్త సేకరణ ప్రైవేటీకరణపై ఆగ్రహం
నెలకు రూ.100 వసూలు చేయడంపై వ్యతిరేకత
కాకతీయ, గజ్వేల్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఇంటింటి చెత్త సేకరణ పేరుతో ప్రతి ఇంటి నుంచి రూ.100 వసూలు చేయాలని నిర్ణయించడంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాలకవర్గ ఆమోదం లేకుండానే పారిశుధ్య సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం అన్యాయమని మండిపడ్డారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో కౌన్సిలర్లు పారిశుధ్య నిర్వహణలో జరుగుతున్న వైఫల్యాలను ఎండగట్టారు. కాంగ్రెస్ కౌన్సిలర్ గుంటుకు లక్ష్మి మాట్లాడుతూ.. వీధుల పరిశుభ్రత, డ్రైనేజీల క్లీనింగ్ వంటి కనీస సౌకర్యాలు కల్పించడంలో మున్సిపాలిటీ విఫలమైందని విమర్శించారు. చైర్మన్, కమిషనర్లు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వాహనాలతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, మున్సిపాలిటీ ద్వారానే సేవలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్ ఆమోదంలో వివక్ష..
మున్సిపాలిటీ బడ్జెట్ ప్రతిపాదనల్లో కూడా కాంగ్రెస్ కౌన్సిలర్లను సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపించారు. కేవలం బీఆర్ఎస్ కౌన్సిలర్ల వార్డుల్లోనే చెత్త బుట్టలు పంపిణీ చేస్తున్నారని, ప్రతిపక్ష వార్డుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలపై మోపిన భారాన్ని వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నాయిని సత్యలక్ష్మి, గుగ్లోత్ రమేష్, ఉపేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, నాయకులు యాదగిరి, నక్క రాములు గౌడ్, గుంటుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

