సంక్షేమ పథకాల ప్రచారంలో సమాచార శాఖది కీలక పాత్ర
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రచార శైలి ఉండాలి
ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ముకుంద రెడ్డికి ‘టీఎస్జేయూ’ వినతి
కాకతీయ, కొత్తగూడెం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలంటే సమాచార పౌర సంబంధాల శాఖ తన ప్రచార శైలిని మరింత ఆధునీకరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం ఆకాంక్షించారు. ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ముకుంద రెడ్డిని మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టీఎస్జేయూ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా నారగౌని పురుషోత్తం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార శాఖది కీలక పాత్ర అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను జోడించి, ప్రచార విభాగాలను బలోపేతం చేయడం ద్వారా పథకాల లబ్ధిని ప్రజలకు మరింత చేరువ చేయవచ్చని సూచించారు. అనుభవజ్ఞులైన ముకుంద రెడ్డి నేతృత్వంలో శాఖ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వృత్తిపరమైన జర్నలిస్టుల సంక్షేమం, అక్రిడిటేషన్లు మరియు ఇతర సమస్యల పరిష్కారంపై కూడా కమిషనర్ సానుకూలంగా స్పందించాలని కోరారు. అనంతరం కమిషనర్‌ను యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎస్జేయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ముత్యం ముఖేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

