ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో హమాలీల సంఖ్యను పెంచాలి
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
గుండారం ఐకేపీ కేంద్రం, ఉపాధి హామీ పనుల పరిశీలన
కాకతీయ, పెద్దపల్లి : జిల్లాలో నాణ్యమైన ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమాన్‌పూర్ మండలంలోని గుండారం ఐకేపీ సెంటర్‌తో పాటు మంథని వ్యవసాయ మార్కెట్‌లోని ఐకేపీ కేంద్రాన్ని, ఎస్సారెస్పీ కెనాల్ మరమ్మత్తు ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. హమాలీ కార్మికుల సంఖ్యను పెంచి కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాధి హామీ పనుల వద్ద కూలీల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో తాగునీరు, నీడ, విశ్రాంతి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్‌డీఓ కాలిందిని, సంబంధిత శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

