కమనీయం.. రమణీయం.. వేంకటేశ్వర కల్యాణం
ముత్యాల తలంబ్రాలతో వైభవంగా వేడుకలు
గోవింద నామస్మరణతో మార్మోగిన సుందరగిరి
కాకతీయ,చిగురుమామిడి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన సుందరగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక బృందం శాస్త్రోక్తంగా వేడుకలను నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో పుణ్యాహవాచనం, అంకురారోహణం, రక్షాబంధనం, ధ్వజారోహణం వంటి కార్యక్రమాలు నిర్వహించగా, మధ్యాహ్నం స్వామివారి ఎదుర్కోళ్ల మహోత్సవం కనులపండువగా సాగింది.
ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో, శేషం నవీన్ కుమార్ ఆచార్యులు కల్యాణ వేడుకలను జరిపించారు. ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంపై స్వామివారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి.. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ జీలకర్ర బెల్లం, ముత్యాల తలంబ్రాల ఘట్టాలను పూర్తి చేశారు. అశేష భక్తజనం గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. వివాహ వేడుక ప్రాముఖ్యతను పండితులు వివరిస్తుంటే భక్తులు పరవశించిపోయారు. స్వామివారికి ఆడెపు ఉషా పరంధాములు దంపతులు 20 రకాల పిండివంటలు, పండ్లతో కూడిన ‘సారే’ను అందజేశారు. కల్యాణం అనంతరం రవీందర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ చొల్లేటి శంకరయ్య, ఈవో రాజ్ కుమార్ అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ వేడుకలో ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సర్పంచ్ జంగా శిరీష వెంకటరమణారెడ్డి, ఆలయ ధర్మకర్తలు పూల లచ్చిరెడ్డి, జీల సంపత్, శేషం నరసింహ చార్యులు, సీనియర్ జర్నలిస్ట్ బొల్లబత్తిని శ్రీనివాస్, మాజీ చైర్మన్ తాళ్లపెళ్లి చిన్న రాజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

