ఆలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ
ఒకే రోజు రూ. 3.01 లక్షల విరాళాలు అందజేత
రాంపురంలో అభయ ఆంజనేయస్వామి ఆలయానికి దాతల సహకారం
కాకతీయ, గీసుగొండ: మండలంలోని రాంపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న అభయ ఆంజనేయస్వామి ఆలయానికి దాతలు, ప్రముఖులు భారీగా విరాళాలు అందజేశారు. ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలకు గ్రామస్థులు, భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా శనివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు దాతలు విరాళాల చెక్కులను ఆలయ కమిటీకి అందజేశారు. ఆలయ నిర్మాణం కోసం రాంపూర్ సర్పంచ్ రడం భరత్ కుమార్ రూ. 1,00,116 విరాళాన్ని అందజేయగా, ఆలయ చైర్మన్ తాబేటి వెంకటేశ్వర్లు రూ. 50,116, తాబేటి వీరస్వామి రూ. 50,116 సమర్పించారు. గీసుగొండ మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు రూ. 51,116 విరాళాన్ని అందించారు. అలాగే కీ.శే. జన్నపురెడ్డి నారాయణరెడ్డి – విజయలక్ష్మి కుటుంబ సభ్యులు రూ. 25,000, గజ్జి రవి రూ. 25,000 అందజేశారు. మొత్తంగా ఒకే రోజు రూ. 3,01,464 విరాళాలు సమకూరినట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం గ్రామ ప్రజలు, దాతలు ఏకమై ముందుకు రావడం అభినందనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ విరాళాల సేకరణతో ఆలయ నిర్మాణ పనులు మరింత వేగంగా కొనసాగుతాయని, గ్రామంలో భక్తి వాతావరణం నెలకొందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని వారు కోరుకున్నారు.

