పేదల ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు
ఎమ్మెల్యే మట్టా రాగమయి
సంక్షేమం, అభివృద్ధియే ప్రభుత్వ ధ్యేయం
అర్హులందరికీ పథకాలు చేరాలి : కలెక్టర్ దివాకర టీఎస్
సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి ప్రగతి ప్రణాళిక సమావేశం
కాకతీయ, మయూరి సెంటర్: అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యచరణతో ప్రజలకు వీటిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. శనివారం సత్తుపల్లిలోని ఎం.ఆర్. గార్డెన్స్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, సర్పంచులు తమ ప్రాంత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి తక్షణమే కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అర్హులకు అండగా..
కలెక్టర్ మాట్లాడుతూ.. 10 ముఖ్యాంశాలను అజెండాగా తీసుకుని గ్రామ, మండల స్థాయిల్లో సభలు పూర్తి చేశామని, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో సమీక్షిస్తున్నామని తెలిపారు. పింఛన్లు, రేషన్, విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇందిరమ్మ జీవిత బీమా వంటి కొత్త పథకాలకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ప్రజా ప్రభుత్వంలో విప్లవాత్మక మార్పులు..
ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గృహ జ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో పేదల జీవితాల్లో మార్పు వచ్చిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించామని, పురోగతిని బట్టి ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాస రెడ్డిల సహకారంతో నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రయానా బేగం, కల్లూరు మున్సిపల్ చైర్మన్ మోహన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆనంద్ బాబు, నీరజ, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

