అర్హులందరికీ సంక్షేమ పథకాలు
రూ. 150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి
అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
వేములవాడలో నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన సభ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం వేములవాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా నేతన్నలకు భరోసా కింద రూ. 4,06,500 ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ చేశారు.
విద్య, వైద్య రంగాలకు పెద్దపీట..
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాల బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రూ. 200 కోట్లతో 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ మంజూరైందని వెల్లడించారు. భవిష్యత్తులో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరైందని వివరించారు.
అభివృద్ధి పథంలో వేములవాడ..
వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ. 150 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. కలికోట సూరమ్మ, మర్రిపల్లి, మల్కపేట ప్రాజెక్టుల పనులు పురోగతిలో ఉన్నాయని, మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 10 లక్షల ఆరోగ్యశ్రీ పరిమితి వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. జిల్లాలో ప్రస్తుతం రూ. 1000 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

