అర్హతే కొలమానం.. రాజకీయాలకు తావులేదు!
త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు
కూసుమంచి ‘ప్రజా దర్బార్’లో మంత్రి పొంగులేటి భరోసా
కాకతీయ , కూసుమంచి: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

మే నెలాఖరుకు రెండో దశ ఇందిరమ్మ ఇళ్లు
ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని, గత ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని వెల్లడించారు. మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ దర్బార్లలో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును రాజకీయ పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట
రైతుల సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటికే 25 లక్షల మందికి రుణమాఫీ చేశామని, రైతు భరోసాను ఎకరానికి రూ. 12 వేలకు పెంచడంతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని గుర్తుచేశారు. వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. మే 5 నుంచి 7 వరకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
సమస్యలకు శాశ్వత పరిష్కారం
సాదా బైనామా, నిషేధిత జాబితా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.

