తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ కుమార్ దీపక్
నిబంధనల ప్రకారం పకడ్బందీగా సేకరణ
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశం
కాకతీయ, రామకృష్ణాపూర్: ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, ధాన్యాన్ని ఆరబెట్టి వెంటనే మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన మందమర్రి మండలం సారంగపల్లి, బొక్కలగుట్ట ప్రాంతాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి, క్షేత్రస్థాయిలో ధాన్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరిస్తోందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులు కూడా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు.
కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి..
ధాన్యం అమ్మకానికి వచ్చే రైతుల సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు మరియు ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. రైతు వివరాలను కంప్యూటర్లో నమోదు చేసేటప్పుడు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను క్షుణ్ణంగా సరిచూడాలన్నారు. ప్రభుత్వం రైతుల గుర్తింపును ధృవీకరించిన అనంతరం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుందని స్పష్టం చేశారు. ఈ పర్యవేక్షణలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

