బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
కరీంనగర్‌లో కమలదళం సంబరాలు
తమిళనాడు, బెంగాల్ ఫలితాలతో ఉత్సాహం
కాంగ్రెస్‌కు మహిళలే బుద్ధి చెప్తారని నేతల ధీమా
కాకతీయ, కరీంనగర్: దేశవ్యాప్త రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జైత్రయాత్ర మొదలైందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ గణనీయమైన ఫలితాలు సాధించిన సందర్భంగా సోమవారం కరీంనగర్ నగరం తెలంగాణ చౌక్‌లో బీజేపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించాయి. టపాసులు కాల్చి, మిఠాయిలు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు.
మోదీ నాయకత్వంపై ప్రజల నమ్మకం..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అవ్వడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అభివృద్ధికి అడ్డుపడే పార్టీలకు ప్రజలు ఎప్పుడూ మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ వంటి కీలక నిర్ణయాలను వ్యతిరేకించిన వారికి మహిళలు తగిన బుద్ధి చెప్పారని వివరించారు.
రాష్ట్రంలో మార్పు తప్పదు..
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు విసిగిపోయారని నేతలు విమర్శించారు. ఉత్తర-దక్షిణ విభజన రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని, 2028లో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ ఏర్పాటుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

