ఆపదలో అండగా.. నిరుపేద కుటుంబానికి భరోసా
మృతుని కుటుంబానికి ఎనుగుల అనిల్ ఆర్థిక సాయం
కాకతీయ, శంకరపట్నం: కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి బీజేపీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ ఎనుగుల అనిల్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన ఎల్కపెల్లి యాకూబ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత్యక్రియల నిర్వహణ భారంగా మారిన విషయాన్ని తెలుసుకున్న అనిల్ సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, తన వంతు సహాయంగా దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ. 5,000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. కష్టకాలంలో తమకు బాసటగా నిలిచిన అనిల్‌ను గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొజ్జ కోటిలింగం, గూళ్ళ రాజు, బొజ్జ సాయి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

