శంకరపట్నంలో బీజేపీ శ్రేణుల సంబరాలు
మూడు రాష్ట్రాల్లో విజయకేతనంపై హర్షం
టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్న కార్యకర్తలు
కాకతీయ, శంకరపట్నం: పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించి, ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శంకరపట్నం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా విజయోత్సవాలు నిర్వహించాయి. సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ జై మోదీ.. జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు.
మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసం..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాద వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ప్రధాని పాలన వల్లే దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతం అవుతోందని కొనియాడారు. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పార్టీ సాధించిన విజయం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి అలివేలి సమ్మిరెడ్డి, ఉప సర్పంచ్ దాసరపు నరేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య, సర్పంచ్ రజిత అశోక్ పాల్గొన్నారు. వీరితో పాటు నాయకులు పోతునూరి రాజు, కనకం సాగర్, కనకం కుమార్, బిజిలి సారయ్య, చెర్ల శ్రీనివాస్, బొజ్జ సాయిప్రకాశ్, గుల్ల రాజు, కంథాల రాజిరెడ్డి, గొల్లిపెల్లి వెంకటేష్, నరసయ్య రాజేందర్, బొజ్జ కుమార్, బిట్టు బోడ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

