ప్యాక్స్ చైర్మన్‌గా తిరుపతి రెడ్డి బాధ్యతల స్వీకారం
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని గద్దపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్ పర్సన్ ఇన్‌ఛార్జిగా గుర్రాల తిరుపతి రెడ్డి మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకవర్గ సభ్యులుగా, పర్సన్ ఇన్‌ఛార్జ్ మెంబర్లుగా పిన్‌రెడ్డి రవీందర్ రెడ్డి, తోట్ల సదయ్య, నల్ల కోమల్ రెడ్డి, రెవెల్లి ఓదెలు, కుర్రే మల్లయ్య, జెన్నెపురెడ్డి సాయి రెడ్డి, కనుకుట్ల చిన్న కొమురయ్య తదితరులు బాధ్యతలు చేపట్టారు. సహకార సంఘం పరిధిలోని రైతుల సంక్షేమానికి, ప్యాక్స్ బలోపేతానికి పాలకవర్గం అంతా సమిష్టిగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి రైతుకూ సహకార సంఘం ద్వారా అందే సేవలు, రుణాలు సకాలంలో అందేలా చూస్తామని నూతన చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ అధికారులు, స్థానిక నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

