ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ
వస్త్ర పరిశ్రమలకు కోటి చీరల ప్రభుత్వ ఆర్డర్
నాణ్యతా ప్రమాణాలతో గడువులోగా పూర్తి చేయాలి
నేతన్నల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాష్ట్రంలోని ఏడు జిల్లాల వస్త్ర పరిశ్రమలకు ప్రజా ప్రభుత్వం కోటి ఇందిరా మహిళా శక్తి నూతన చీరల తయారీ ఆర్డర్‌ను అందజేసిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, నూతన రంగుల చీరలను ఆవిష్కరించారు. ఈ సదస్సుకు చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రత్యేకంగా హాజరయ్యారు.

చేనేత రంగానికి ఆర్థిక ఊతం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కోటి మంది మహిళలకు కోటి చీరలు అందించాలనే సత్సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సిరిసిల్లా జిల్లాలోని 130 మ్యాక్స్ సంఘాలతో పాటు కరీంనగర్ (గర్షకుర్తి), జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జనగాం, యాదాద్రి జిల్లాలకు కలిపి మొత్తం 7 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. ఇందులో 95 లక్షల సాధారణ చీరలతో పాటు, 5 లక్షల గోచి చీరలు (9 మీటర్ల పొడవు) ఉన్నాయన్నారు. నేతన్నలకు భద్రత కింద రూ. 5 లక్షల బీమాతో పాటు చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేశామని గుర్తు చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేలా వేములవాడలో రూ. 50 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి యారన్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, 90 శాతం క్రెడిట్ పై యార్న్ ఇస్తున్నామని వివరించారు.

నాణ్యతతో స్వయం సమృద్ధి
అనంతరం హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమలో తయారవుతున్న ఇందిరా మహిళాశక్తి చీరలు ఎంతో నాణ్యతతో ఉన్నాయని ప్రశంసించారు. రానున్న ఆర్డర్లను కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో తయారు చేయాలని సూచించారు. ఈ ఆర్డర్ల ద్వారా పరిశ్రమకు 6 నుంచి 7 నెలల పాటు నిరంతరాయంగా ఉపాధి లభిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ స్థానిక కార్మికుల శ్రమకు ప్రతీకగా నిలిచే ఈ చీరలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు స్వరూప, రాములు నాయక్, చేనేత జౌళి శాఖ జేడీ వెంకటేశ్వర రావు, ఏడీ సంతోష్ మరియు వివిధ జిల్లాల వస్త్ర పరిశ్రమ యజమానులు పాల్గొన్నారు.

