వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాలు
నిరుద్యోగులకు త్వరలోనే తీపి కబురు
విద్యా, వైద్యం, మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యం
బాలసదనాలు, అంగన్వాడీల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల వినియోగం
మంత్రి దామోదర్ రాజనర్సింహ
నర్సింగ్ ఆఫీసర్లు, మల్టీపర్పస్ ఏఎన్ఎం ఫలితాల విడుదల
కాకతీయ,తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఇందులో భాగంగానే రికార్డు స్థాయిలో వైద్య, ఆరోగ్యశాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టామని తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో రూరల్ డెవలప్మెంట్ నిధులతో నిర్మించిన బాలసదనం నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ ముగింపు వారోత్సవాల సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మల్టీపర్పస్ ఏఎన్ఎంలు, నర్సింగ్ ఆఫీసర్ల ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను అతి త్వరలోనే అధికారికంగా విడుదల చేసి నియామక పత్రాలు అందజేస్తామని ప్రకటించారు.
అంగన్వాడీలు, బాలసదనాల పరిరక్షణ
రాష్ట్రంలో బలహీన వర్గాలు, మహిళలు, చిన్నారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే బాలసదనాలను, అంగన్వాడీ కేంద్రాలను కాపాడుకునే గురుతర బాధ్యతను ప్రభుత్వం భుజాన వేసుకుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రభుత్వ గ్రాంట్లతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను జోడించి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలను నిర్మిస్తామని, అక్కడ ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలతో పాటు మూడేళ్ల లోపు చిన్నారులకు పోషకాహార బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తున్నామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలకు ఉచిత వైద్య పరీక్షలు, వ్యాక్సినేషన్ సేవలు అందిస్తున్న ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తల నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా కొనియాడారు. అనంతరం బాలసదనంలోని బాలికలతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, అక్కడ తక్షణమే రక్షిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
దివ్యాంగులకు స్కూటీల పంపిణీ..
ఈ పర్యటనలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అర్హులైన దివ్యాంగులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉచితంగా త్రీవీలర్ స్కూటర్లను అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక వారోత్సవాలలో భాగంగా జిల్లాలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ల క్లీనింగ్ డ్రైవ్, 18 ఏళ్లు పైబడిన అనాథ పిల్లలను గుర్తించి వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం, వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా హెల్త్ కార్డులు అందజేయడం వంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారులు మంత్రికి నివేదించారు. ఆశ్రమాల నుంచి బయటకు వచ్చిన పిల్లలకు పునరావాసం కల్పించి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నామని వివరించారు. ఈ ప్రగతి సమీక్షా కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేష్ షెట్కర్, సబ్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా సంక్షేమ అధికారి లలితా కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీఓ సుజాత, ఆశ్రమ నిర్వాహకురాలు విజయకుమారి తదితర ఉన్నతాధికారులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

