72 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
అక్రమ పట్టాలు రద్దు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
కోయ శ్రీ హర్ష, జిల్లా కలెక్టర్ – విచారణ అధికారులు
కాకతీయ, పెద్దపల్లి : ప్రభుత్వ భూములపై అక్రమ కబ్జాలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసిన వారు స్వచ్ఛందంగా భూములను అప్పగించాలని, లేనిపక్షంలో పట్టాలు రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి శివారులోని సర్వే నెం.679లో గల 72.03 ఎకరాల ప్రభుత్వ పరంపోగు భూమిని జిల్లా యంత్రాంగం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. తాత్కాలిక సాగు అనుమతిని ఆసరాగా చేసుకుని అక్రమంగా పట్టా మార్పిడులు, రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫిర్యాదుతో రెవెన్యూ మంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లి ఆర్డీవో సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ భూమిని ప్రభుత్వ ఖాతాలోకి బదిలీ చేశారు. 1347 ఫసలీ కాలం నాటి తాత్కాలిక అనుమతులను అడ్డం పెట్టుకుని 11 మందికి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించి, సంబంధిత నోటీసులు జారీ చేసిన అనంతరం పట్టాలను రద్దు చేసినట్లు కలెక్టర్ వివరించారు. ఈ విచారణ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో పాటు పెద్దపల్లి ఆర్డీవో, ధర్మారం తహసీల్దార్ మరియు రెవెన్యూ యంత్రాంగం పాల్గొన్నారు.

