రాజ్భవన్లో కాదు.. అసెంబ్లీలోనే మెజారిటీ తేలాలి
గవర్నర్ తీరు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే
అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ఆహ్వానించకపోవడం సరికాదు
: మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్
కాకతీయ, నేషనల్ డెస్క్ : మెజారిటీ అనేది రాజ్భవన్లో కాదు, అసెంబ్లీ వేదికగానే నిరూపితం కావాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పేర్కొన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనపై ఆయన స్పందించారు. ఈ మేరకు చెన్నైలో మీడియాతో మాట్లాడారు. తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కమల్ హాసన్ విమర్శించారు. తమిళనాడు చరిత్రలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని, ఈ క్రమంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిపై ఉందని గవర్నర్కు గుర్తు చేశారు.
బొమ్మై తీర్పు స్ఫూర్తితోనే ముందుకు
ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధతను ప్రస్తావిస్తూ ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కమల్ హాసన్ ఉటంకించారు. 108 స్థానాలు గెలుచుకున్న విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరకపోవడం ఓటర్ల తీర్పును ధిక్కరించడమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ 233 మంది ఎన్నికైన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేయలేకపోవడం రాష్ట్రానికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఇది పార్టీ పరంగా చేస్తున్న విమర్శ కాదు, ఒక భారతీయ పౌరుడిగా తన రాజ్యాంగ హక్కుల కోసం వినిపిస్తున్న గొంతుక అని ఆయన స్పష్టం చేశారు. తక్షణమే ప్రజా తీర్పును గౌరవించి, రాజ్యాంగపరమైన విధులను నిర్వర్తించాలని ఆయన సంబంధిత వర్గాలను కోరారు. తమకు మెజారిటీ రానందున బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ రాజకీయ పరిణతిని కమల్ హాసన్ అభినందించారు.

